
క్రింది పాఠాన్ని చదవండి లేదా వినండి
12:1మోషే అహరోనులతో ఐగుప్తు దేశంలో యెహోవా ఇలా చెప్పాడు. 2“నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరానికి మొదటి నెలన్న మాట. 3ఇశ్రాయేలు సమాజంతో ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో కలసి ఈ నెల పదవ రోజున తమ కుటుంబాల ప్రకారం ప్రతి ఒక్కడూ, అంటే ప్రతి ఇంటి లెక్క చొప్పున ఒక గొర్రెపిల్లను గానీ, మేకపిల్లను గానీ తీసుకోవాలి.
4ఒక కుటుంబం ఆ గొర్రెపిల్లను తినడానికి చిన్నదైతే ఆ కుటుంబ పెద్ద ఒక గొర్రె పిల్ల, లేక మేక పిల్ల సరిగ్గా సరిపోయే విధంగా తన పొరుగింటి కుటుంబ సభ్యులను కలుపుకుని ఆ ప్రకారం వారిని లెక్కగట్టాలి.
5మీరు ఎన్నుకొనే గొర్రె లేదా మేక పిల్ల ఒక సంవత్సరం వయసు గల మగదై ఉండాలి. అది ఎలాంటి లోపం లేకుండా ఉండాలి. 6ఈ నెల 14 వ రోజు వరకూ దాన్ని ఉంచాలి. తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా సాయంకాల సమయంలో దాన్ని చంపాలి. 7కొంచెం రక్తం తీసుకుని ఆ మాంసం ఏ ఇంట్లో తింటారో ఈ ఇంటి గుమ్మం రెండు నిలువు కమ్ముల మీద, పై కమ్మీ మీద చల్లాలి.
8ఆ రాత్రివేళ నిప్పులతో మాంసాన్ని కాల్చి తినాలి. పొంగకుండా చేసిన రొట్టెలతో, చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి. 9దాన్ని పచ్చిగా గానీ ఉడికించిగానీ తినకూడదు. దాని తల, కాళ్ళు, లోపలి భాగాలను నిప్పుతో కాల్చి తినాలి. 10తెల్లవారే పాటికి దానిలో ఏమీ మిగల్చకూడదు. ఒకవేళ ఏమైనా మిగిలితే దాన్ని పూర్తిగా కాల్చివెయ్యాలి.
11మీరు దాన్ని తినవలసిన విధానం ఇది. మీ నడుముకు నడికట్టు కట్టుకుని, కాళ్ళకు చెప్పులు వేసుకుని, మీ కర్రలు చేతబట్టుకుని త్వరత్వరగా తినాలి. ఎందుకంటే అది యెహోవాకు పస్కా బలి.
12నేను ఆ రాత్రి వేళ ఐగుప్తు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుషుల్లో, జంతువుల్లో మొదటి సంతానం మొత్తాన్ని చంపివేస్తాను. ఐగుప్తు దేవుళ్ళ విషయంలో తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను. 13మీరు నివసించే ఇళ్ళపై ఉన్న ఆ రక్తం యెహోవా రాక విషయంలో మీకు ఆనవాలుగా ఉంటుంది. నేను ఐగుప్తు జాతి మొదటి సంతానాన్ని నాశనం చేస్తూ ఉన్న సమయంలో ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా దాటి వెళ్ళిపోతాను. ఈ విపత్తు మీ మీదికి వచ్చి మిమ్మల్ని నాశనం చేయదు.
పొంగని రొట్టెల పండగ
14కాబట్టి ఈ రోజు మీకు స్మారక దినంగా ఉంటుంది. ఈ రోజును యెహోవా పండగ దినంగా తరతరాలుగా మీరు ఆచరించాలి. ఎందుకంటే ఇది యెహోవా నియమించిన శాశ్వతమైన కట్టుబాటు. 15ఏడు రోజులపాటు మీరు పొంగకుండా కాల్చిన రొట్టెలు తినాలి. మొదటి రోజున మీ ఇళ్ళలో పొంగ జేసే పదార్ధమంటూ ఏదీ లేకుండా చెయ్యాలి. మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకూ పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తింటే ఆ వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల్లో లేకుండా చేయాలి. 16ఆ మొదటి రోజు మీరు నా కోసం పరిశుద్ధ సమాజంగా సమకూడాలి. ఏడవ రోజున అలాటి సమావేశమే జరగాలి. ఆ రెండు రోజుల్లో అందరూ తినడానికి భోజనం సిద్ధం చేసుకోవడం తప్ప ఏ పనీ చేయకూడదు. మీరు చేయగలిగిన పని అదొక్కటే.
17ఈ పొంగని రొట్టెల పండగను మీరు ఆచరించాలి. ఎందుకంటే నేను మిమ్మల్నందరినీ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకు వచ్చే రోజు అదే. కాబట్టి మీరు, మీ రాబోయే తరాలన్నీ ఈ రోజును ఆచరించాలి. ఇది మీకు శాశ్వతమైన కట్టుబాటుగా ఉంటుంది. 18మొదటి నెల 14 వ రోజు సాయంత్రం మొదలు అదే నెల 21 వ రోజు సాయంత్రం దాకా మీరు పొంగని పిండితో చేసిన రొట్టెలు తినాలి. 19ఏడు రోజులపాటు మీ ఇళ్ళలో పొంగజేసే పదార్ధమేదీ కనబడ కూడదు. పొంగజేసే పదార్ధంతో చేసిన దాన్ని మీలో ఎవరైనా తింటే అతడు విదేశీయుడైనా దేశంలో పుట్టిన వాడైనా ఇశ్రాయేలు ప్రజల సమాజంలో లేకుండా చేయాలి. 20మీరు పొంగజేసే పదార్థంతో చేసిన దేనినీ తినకూడదు. మీకు చెందిన అన్ని ఇళ్ళలో పొంగకుండా కాల్చిన రొట్టెలు మాత్రమే తినాలి.”
మొదటి పస్కా పండగ ఆచరణ
21అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలను పిలిపించాడు. వాళ్ళతో ఇలా చెప్పాడు. “మీరు మీ కుటుంబాల కోసం మందలోనుండి మేకపిల్లను గానీ గొర్రెపిల్లను గానీ తీసుకుని పస్కా బలి అర్పించండి. 22తరువాత హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి, గుమ్మాల పైకమ్మికీ రెండు నిలువు కమ్ములకూ పూయాలి. మీలో ఎవ్వరూ తెల్లవారే వరకూ మీ ఇళ్ళ గుమ్మాల గుండా బయటకు వెళ్ళకండి. 23యెహోవా ఐగుప్తీయులను హతమార్చడానికి తిరుగుతూ ఇంటి గుమ్మం పైకమ్మి మీదా రెండు నిలువు కమ్ముల మీదా ఉన్న రక్తాన్ని చూసి ఆ ఇంటిని దాటిపోతాడు. సంహారం చేసే దూతను మీ ఇళ్ళలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని సంహరించడానికి ఆయన అనుమతి ఇయ్యడు.
24అందుచేత మీరు దీన్ని ఆచరించాలి. ఇది మీకు, మీ సంతతికి శాశ్వతమైన చట్టంగా ఉంటుంది. 25యెహోవా వాగ్దానం చేసినట్టు ఆయన మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఒక ఆచార క్రియగా పాటించాలి. 26మీ కొడుకులు ‘మీరు జరిగిస్తున్న ఈ ఆచారం ఎందుకోసం?’ అని మిమ్మల్ని అడిగితే, 27‘ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను సంహరించే సమయంలో వారి మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజల ఇళ్ళను దాటి ఐగుప్తులో మనల్ని కాపాడాడు’ అని చెప్పాలి” అన్నాడు. అప్పుడు సమకూడిన ప్రజలంతా అది విని తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు. 28అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విధేయులై యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్టు చేశారు.
కొన్ని క్షణాలు తీసుకుని కథను మీ మాటల్లో మళ్లీ చెప్పండి. మీరు దాన్ని గట్టిగా మాట్లాడాలని లేదా రాయాలని అనుకోవచ్చు. మీరు దాన్ని గుర్తు చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే, దాన్ని మళ్లీ చదవండి లేదా వినండి.
మీరు కథతో పరిచయం ఉన్నట్లు భావించినప్పుడు, కింది ప్రశ్నలను ఆలోచించడానికి లేదా చర్చించడానికి కొంత సమయం తీసుకోండి.
Get Discovery Bible Studies on your phone
Discover copyright ©2015-2026 discoverapp.org
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.